సంతకాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలోని ఐటీఐలను సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర అధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఉపాధి శిక్షణా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ గ్లోబల్ హ్యూమన్ రీసోర్సెస్ ప్రసిడెంట్ పవన్ భగేరియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు పలు ప్రతిపాదనలపై చర్చించారు.
అందులో భాగంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు వచ్చింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ ఐటీఐల్లో 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు పలు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.