గోదావరి ప్రాజెక్టుకు రూ. 5560 కోట్లు
కేటాయించిన ప్రిన్సపల్ సెక్రటరీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రకటించిన మేరకు గోదావరి రెండో దశ పనులకు పచ్చ జెండా తెలిపింది. ఇందు కోసం భారీ ఎత్తున నిధులను కేటాయించింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గోదావరి ప్రాజెక్టు రెండో దశ పనులకు సంబంధించి ఏకంగా రూ. 5,560 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ పనులలో 3600 ఎంఎం డయా భారీ పైపు లైన్ , నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తారని దాన కిషోర్ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.
అంతే కాకుండా తాగు నీటి అవసరాలతో పాటు మూసీ నది ప్రక్షాళనకు కూడా ఇవే నిధులను వాడడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి మొదటి దశ పనుల ద్వారా 163 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసేందుకు నడుం బిగించింది.