గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు
ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా యుద్ద నౌక , దివంగత గాయకుడు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ పేరు మీద సినిమా రంగానికి సంబంధించి అవార్డులను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి గద్దర్ అవార్డుల కోసం లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలను రూపొందించనుంది ఈ కమిటీ. ఇదిలా ఉండగా గద్దర్ అవార్డుల కమిటీకి చైర్మన్ గా ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావు, వైస్ చైర్మన్ గా వెంకట రమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు ను ఎంపిక చేసింది.
వీరితో పాటు కమిటీ సలహాదారులుగా ప్రముఖ దర్శకులు హరీశ్ శంకర్, నారాయణ మూర్తి, తమ్మా రెడ్డి భరద్వాజ, కె. రాఘవేంద్ర రావు, అల్లాణి శ్రీధర్ , బలగం వేణు, కవి అందెశ్రీ, నిర్మాతలు సురేష్ బాబు, సానా యాది రెడ్డి, అల్లు అరవింద్, గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెల, రచయిత, నటుడు తనికెళ్ల భరణి, గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ను నియమించింది ప్రభుత్వం.