ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత దేశం గర్వించ దగిన రాజకీయ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప సూచకంగా శుక్రవారం సెలవు ప్రకటించింది. ఆయనకు నివాళిగా రాష్ట్రమంతటా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ను స్మరించుకుంటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. నివాళులు అర్పిస్తారు. ఇదిలా ఉండగా సింగ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
దేశం గర్వించదగిన రాజకీయ నేతలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు అని పేర్కొన్నారు . ఆయనతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో తాను మాజీ పీఎం నుంచి ఎన్నో నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక రకంగా ఆత్మీయుడిని, మార్గదర్శిని కోల్పోయానని వాపోయారు.
ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఎన్నదగిన ఆర్థికవేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు అని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సంస్కరణలకు తెర తీయడమే కాదు దేశాన్ని ఇక్కట్ల నుంచి రక్షించిన అరుదైన నాయకుడు అంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.