లగచర్ల లో భూ సేకరణ ఉప సంహరణ
వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూ సేకరణ ఉప సంహరించు కుంటున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా అక్కడ తమ భూములు ఇవ్వబోమంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు, రైతులు ఆందోళన చేపడుతున్నారు.
భూ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కుడా కమిషనర్ పై దాడికి పాల్పడ్డారు. రైతులను, మహిళలను, గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు . వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో భూ సేకరణ చేయబోమంటూ ప్రకటించింది సర్కార్.
లగచర్ల బాధితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ , బీజేపీ నేతలు. గిరిజన సంఘాల నేతలు నేరుగా ఢిల్లీలో ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగడంతో పరిశ్రమను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇవాళ లగచర్ల నుంచి కూడా తప్పు కోవడం విస్తు పోయేలా చేసింది.