తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్
ఉచిత విద్యుత్..రూ.500లకే సిలిండర్
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ కీలక అంశాలపై చర్చించింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేస్తోంది. తాజాగా మరో 2 గ్యారెంటీలకు ఆమోదం తెలిపింది. ఇక ఈ ఏడాది చివరి వరకు 2 లక్షల పోస్టులను భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది మంత్రివర్గం.
200 యూనిట్ల లోపు ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్యుత్ తో పాటు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ను ఇచ్చే పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల నుంచి ఈ రెండూ అమలు చేస్తామని ప్రకటించింది కేబినెట్. ఆయా అంశాలకు సంబంధించి నాలుగు గంటల పాటు చర్చించడం విశేషం.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వీటిని అమలు చేస్తే భారీ ఎత్తున ఓట్లు పడే ఛాన్స్ ఉందని సీఎం భావించారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇక నుంచి అధికారికంగా నెంబర్ ప్లేట్లను కూడా మార్చుతున్నట్లు స్పష్టం చేశారు. టీఎస్ కు బదులుగా టీజీగా మారుస్తున్నట్లు ప్రకటించారు.