అదానీ ఇచ్చే రూ. 100 కోట్లు వద్దనుకున్నాం
సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గౌతమ్ అదానీకి సంబంధించి ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీకి తాను ఇస్తానన్న రూ. 100 కోట్లను తీసుకోకూడదని తాము నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇటీవల అదానీపై తీవ్ర ఆరోపణలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని వెల్లడించారు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయొద్దని అదానీ గ్రూప్‌కు లేఖ రాయడం జరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి.
అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించ కూడదని తాము మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనవసరమైన వివాదాల్లోకి తమ సర్కార్ ను ఇరికించే ప్రయత్నం చేయొద్దని ఆయన సూచించారు. ఇది ఒక్కరం తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొన్నారు సీఎం.
ఇదిలా ఉండగా అదానీ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకించి రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనతో పాటు మోడీని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం విస్తు పోయేలా చేసింది.