చరిత్ర ఆనవాళ్లు చెరిపేస్తే ఎలా
ఏలె లక్ష్మణ్ ను అవమానించడం కాదా
హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సీఎం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. జయ జయహే తెలంగాణ గీతానికి స్వర కల్పన చేసేందుకు కీరవాణితో సంప్రదింపులు జరపడాన్ని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ చరిత్రను అవమానించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందంటూ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కళాకారుడు తెలంగాణకు చెందిన ఏలె లక్ష్మణ్. తను తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన లోగోను తయారు చేశాడు.
రాష్ట్ర రాజ ముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ను రూపొందించారు. ఇది రాచరికపు పోకడ అంటూ పేర్కొనడం దారుణమన్నారు.
అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రి మండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా అని ప్రశ్నించారు. గత పాలకులపై ఉన్న కోపంతో ఉన్న చరిత్రను చెరిపి వేయాలని అనుకోవడం దారుణం. ఇకనైనా ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.