రుణ మాఫీకి మార్గదర్శకాలు జారీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన రైతు రుణ మాఫీకి సంబంధించి శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా కీలకమైన మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఎవరెవరు , ఎప్పుడెప్పుడు , ఎంత వరకు రుణాలు తీసుకున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణ మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. స్వల్ప కాలిక పంట రుణాలకు కూడా ఈ రుణ మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఉన్న అన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులలో రుణాలు తీసుకున్న రైతులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇందుకు సంబంధించి రుణాలు మాఫీ చేయలేమని పేర్కొంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.
కాగా 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటల రుణాలకు సంబంధించి మాఫీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.