ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించింది. మార్చి 30న హుజూర్ నగర్ మట్టపల్లి లో సీఎం రేవంత్ ప్రారంభిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తారని తెలిపారు. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం ఇస్తూ వచ్చారని, ఇక నుంచి సన్న బియ్యం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించారని పేర్కొన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడం జరిగిందని, 24 లక్షల టన్నుల సన్నబియ్యం సేకరించామన్నారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని చెప్పారు. గతంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రుణ మాఫీ పూర్తి చేశామన్నారు. పన్నుల రూపేణా వచ్చిన ఆదాయం జీతాలు ఇచ్చేందుకు కూడా సరి పోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వలేక పోతున్నామని వాపోయారు. అయినా అష్ట కష్టాలు పడి సర్కార్ ను నెట్టుకు వస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదన్నారు.