15 నుంచి ఒంటి పూట బడులు
ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఎండా కాలం ప్రారంభం కావడంతో విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారు. దీంతో విద్యా శాఖ పరంగా ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో చదువుకుంటున్న పిల్లలకు ఖుష్ కబర్ చెప్పింది సర్కార్. మార్చి నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించారు సీఎస్. ఇందులో భాగంగా విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
కాగా ఒంటి పూట బడులు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగించాలని ఆదేశించింది. 12.30 గంటలకు మధ్యాహ్నం భోజనం పెట్టాలని పేర్కొంది. ఇక
10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న బడులలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేసింది.