అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్
విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం శాసన సభ వేదికగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇందులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని చెప్పారు. గత ప్రభుత్వం సదరు సంస్థను నిర్వీర్యం చేసిందని, ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులతో రెండు కమిటీలు వేశామని వెల్లడించారు.
వచ్చిన వెంటనే టీఎస్పీస్సీ ద్వారా 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా తాము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పామని, ఇచ్చిన మాట తమ సర్కార్ నిలబెట్టుకుందని ప్రకటించారు. జాబ్స్ , తేదీలు, ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తామనేది కూడా జాబ్ క్యాలెండర్ లో వెలువరించడం జరిగిందని చెప్పారు.
పరీక్ష సరిగా నిర్వహించ లేని కారణంగా రెండు సార్లు గ్రూప్-1 రద్దయిందని , ప్రస్తుతం వాటిని తిరిగి నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.