సీఎం తీరుపై మీడియా సంతృప్తి
ప్రజాస్వామ్యయుతమైన ఆదరణ
హైదరాబాద్ – గత కేసీఆర్ ప్రభుత్వం కంటే ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజంతో పాటు మీడియా కూడా. గతంలో మాజీ సీఎం కేసీఆర్ తాను చెప్పడం, అనుకున్నది మాట్లాడటం వరకు మాత్రమే ఉండేది. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని చులకన చేయడం కేసీఆర్ కు, ఆయన పరివారానికి అలవాటుగా మారింది. దీంతో మీడియా మొత్తం కేసీఆర్ భజన చేయడంలో నిమగ్నమై పోయింది.
వాస్తవానికి ఒకప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అటు ఇటుగా వార్తలు రాయడం, ప్రసారం చేయడం జరిగేది. కానీ ఇవాళ దేశంలో , ఇటు రాష్ట్రంలో ప్రచురణ, ప్రసార మాధ్యమాలన్నీ ఆయా పార్టీలకు, ప్రభుత్వానికి కొమ్ము కాయడంలో పోటీ పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఒకటి రెండు తప్ప అన్నీ గంప గుత్తగా మోదీని మోయడంలో, ఆయనకు ప్రచారం కల్పించడంలో ముందంజలో కొనసాగుతున్నాయి.
ఇక తెలంగాణలో అయితే ప్రింట్, మీడియా సంస్థలన్నీ కేసీఆర్ కు భజన చేస్తూ వచ్చాయి. తాజాగా ప్రభుత్వం మారడంతో అవి గత్యంతరం లేక రేవంత్ రెడ్డికి ప్రాచుర్యం కల్పిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా మాత్రం ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. ఏకి పారేస్తోంది. మొత్తంగా రేవంత్ వచ్చాక జర్నలిస్టులకు కొంత ప్రాధాన్యత పెరిగింది. వారికి స్వేచ్ఛ లభించింది.