5 టీఎంసీల నీళ్లు విడుదల చేయండి
కర్ణాటక – సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. పాలమూరు జిల్లాలో సాగు నీరు, తాగు నీటి ఎద్దడి నెలకొందని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఇదిలా ఉండగా సీఎం , డీకే శివకుమార్ లను కలిసిన అనంతరం మంత్రులు దుద్దళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎండా కాలం వస్తోందని, ఎండలు ఈసారి మండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీని కారణంగా ప్రస్తుతం పాలమూరు జిల్లా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరామన్నారు.
తాము చేసిన వినతికి సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజలు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.