మార్చి 3న నోటిఫికేషన్ 20న ఎన్నికలు
హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29వ నాటితో ముగియనుంది. ఐదుగురిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఉన్నారు. దీంతో షెడ్యూల్ ను ప్రకటించింది.
ఇదిలా ఉండగా షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. 10వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 11న వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లు ఉపసంహరణకు గడువు 13వ తేదీ . ఇక పోలింగ్ కు సంబంధించి మార్చి 20న నిర్వహిస్తారు.
అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఆరోజే ఫలితాలను ప్రకటిస్తారు.
కాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య వారికి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కొద్ది నెలల కిందట ఎగ్గె మల్లేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హసన్ ఎంఐఎం నుంచి ఉన్నారు. ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లు కాంగ్రెస్ కు పోగా ఒక ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ కు రానుంది.