100కు పైగా నామినేషన్లు దాఖలు
హైదరాబాద్ – తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ దాఖలుకు ఇవాల్టితో గడువు ముగిసింది. 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 14న విత్ డ్రాకు చివరి గడువు. 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లను లెక్కిస్తారు. ఆరోజే ఫలితాలు వెల్లడిస్తారు.
మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు, నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పోటీ చేసేందుకు కావాల్సినంత మెజారిటీ రాదేమోనన్న ఆలోచనతో పోటీ చేయక పోవడమే మంచిదని వెనక్కి తగ్గినట్లు సమాచారం.
మరో వైపు గత ఏడాదిలో జరిగిన శాసన సభ , సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు సత్తా చాటాయి. గణనీయంగా సీట్లను, ఓటు శాతాన్ని పెంచుకున్నాయి. కానీ ఆశించిన మేర ప్రజల్లో ఆదరణను ఈ రెండు పార్టీలు కోల్పోతూ వస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ అధికార పక్షానికి వంత పాడుతుండడం పట్ల జనం ఆగ్రహంతో ఉన్నారు.