క్రిక్కిరిసిన ఫలక్ నుమా పోలీస్ స్టేషన్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సర్వ శిక్షా అభియాన్ కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు కదం తొక్కారు. తాము వెట్టి చాకిరి చేస్తున్నామని, గత కొన్నేళ్లుగా చాలీ చాలని జీతాలకు పని చేస్తున్నామని వాపోయారు. తమను పర్మినెంట్ చేయాలని, మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వ శిక్షా అభియాన్ లో పని చేస్తున్న వారందరికీ ఎంటీఎస్ ను వర్తింప చేశారని, కానీ తెలంగాణ సర్కార్ తమ గురించి ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. మంగళవారం ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు వందలాది మంది ఉద్యోగులు రాష్ట్రం నలు మూలల నుంచి తరలి వచ్చారు.
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఎస్ఎస్ఏలో 25,000 మంది పని చేస్తున్నారని, వరంగల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎస్ఎస్ఏ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడని, ఇప్పుడు చప్పుడు చేయడం లేదంటూ మండిపడ్డారు. పెద్ద ఎత్తున కాంట్రాక్టు ఉద్యోగులను ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.