ఏపీ వల్ల తెలంగాణకు తీరని నష్టం
తెలంగాణ వాదుల్లో నెలకొన్న ఆందోళన
హైదరాబాద్ – ఉమ్మడి ఏపీలో తెలంగాణ సర్వ నాశనమైంది. చివరకు అలుపెరుగని ఉద్యమం కారణంగా తెలంగాణ ఏర్పాటైంది. అయినా ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఇక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ వారికి చెందినవే ఉన్నాయి. ఇక సినిమా రంగంలో కూడా తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇది జగమెరిగిన వాస్తవం.
ఇవాళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీఎంలు చంద్రబాబు , రేవంత్ రెడ్డి లు భేటీ కానున్నారు. ఈ సందర్బంగా ఇంకా అపరిష్కృతంగా మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం పట్టు పట్టే ఛాన్స్ ఉంది. కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడును తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు.
తెలంగాణను సర్వ నాశనం చేసిన చరిత్ర ఆయనది. ఈ సమయంలో విభజన అంశాలపై తెలంగాణ బరిగీసి కొట్లాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నీళ్లు, భూములు, ఆస్తులు, నిధులు, విద్యుత్, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలంబిస్తే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.
విభజనలో తెలంగాణ కొన్ని హెచ్ఓడి పోస్టులను కోల్పోయింది (ఉదాహరణకు డిటీసిపి, ఇప్పటికీ పోస్టు క్రియేట్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏపీ మంత్రి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లు పొడిగించాలని కోరుతామని చెప్పారు.
భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడి ఆస్తులు, స్థిరాస్తులు అక్కడికే చెందుతాయని పునర్విభజన చట్టంలో ఉంది . సింగరేణి సంస్థకు సంబంధించిన విజయవాడలో ఉన్న భూములను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది . కానీ మంత్రి నారాయణ తెలంగాణలోని హౌసింగ్ కార్పొరేషన్, దిల్ భూములపై ఇంకా ఆశ పడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ (నెల్లూరు జిల్లా) నిర్మాణానికి తెలంగాణ పవర్ జనరేషన్ ప్లాంట్లను తాకట్టుగా పెట్టి రుణాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి.
అంతే కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు తెలంగాణలోని జనరేటింగ్ స్టేషన్ల యూనిట్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి ఆంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు సమకూర్చిన సంఘటనలు ఉన్నాయి
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలల్లో ప్రధాన భూమిక పోషించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారు . వారిలో ఒకరు ఇప్పుడు ఏపీ సీఎంవోలో ఉన్నారు .