సర్కార్ నిర్ణయంపై పంతుళ్లు ఫైర్
ఫేషియల్ రికగ్నిషన్ యాప్
హైదరాబాద్ – ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలు, ఇంకో వైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాడి వేడిగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. గత సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీచర్లు, ఉద్యోగులు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఇది పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి కొలువు తీరి 5 నెలలు పూర్తి కాగానే చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటుండడంపై పంతుళ్లు భగ్గుమంటున్నారు. తాజాగా విద్యా శాఖ తీసుకున్న నిర్ణయం, తీసుకు వచ్చిన యాప్ తీవ్ర గందర గోళానికి దారి తీసింది. ఇది ఆ పార్టీకి తీరని దెబ్బగా మారే ఛాన్స్ లేక పోలేదని సంఘాలు పేర్కొంటున్నాయి.
తాము నమ్ముకున్న పాపానానికి తమపై నిఘా పెట్టేలా యాప్ తీసుకు వస్తారా అంటూ మండిపడుతున్నారు టీచర్లు. టీచర్లు తప్పనిసరిగా అటెండెన్స్ ఉండాలని, ఇందుకు గాను విద్యా శాఖ కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు ) పేరుతో యాప్ తీసుకు వచ్చింది. ఈ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో అటెండెన్స్ లేక పోతే ఆరోజు జీతం, అలవెన్సులు కట్ చేస్తుంది విద్యా శాఖ. ఇప్పటికే టీచర్లు లేక , వసతి సౌకర్యాలు లేక నానా తంటాలు పడుతుంటే అదనంగా ఈ పెత్తనం ఏంటి అంటూ మండిపడుతున్నారు.