మహిళా కమిషన్ చైర్ పర్సన్
హైదరాబాద్ – తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలంతా కలిసి సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. నేల నుంచి నింగి దాకా మహిళలు అద్భుతమైన ప్రతిభా పాటవాలతో దూసుకు వెళుతున్నారని అన్నారు. ఒకప్పుడు మహిళలు పని చేయాలంటే ఒకటి రెండు దారులు మాత్రమే ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచమే మనందరి చేతుల్లోకి వచ్చిందన్నారు నేరెళ్ల శారద.
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని మహిళలు నిరూపిస్తున్నారని చెప్పారు. ఒక తల్లిగా, భార్యగా, కూతురిగా అన్ని పాత్రలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉందని స్పష్టం చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్. తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారన్నారు. ఇదే సమయంలో అద్దె ప్రాతిపదికన సంఘాలకు 150 బస్సులను ఇవ్వడం జరిగిందన్నారు నేరెళ్ల శారద.