వెంకట భూపాల్ రెడ్డి ఆస్తులు రూ. 5 కోట్లు
గుర్తించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ
హైదరాబాద్ – తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు, అవినీతికి పాల్పడుతున్న వారిపై నజర్ పెట్టింది. ఇదిలా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల పై రంగారెడ్డి జిల్లా పూర్వపు అదనపు కలెక్టర్ (భూ , రెవెన్యూ విభాగం) ఎం.వెంకట భూపాల్ రెడ్డి పై (ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు) అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని గుర్తించింది ఏసీబీ.
ఈ మేరకు ఎం. వెంకట భూపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టింది. నిందితుడినికి సంబంధించిన ఇల్లు, బంధువుల గృహాలతో పాటు మరో నాలుగు చోట్ల అవినీతి నిరోధక శాఖ బృందాలు సోదాలు జరిపాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా ఆస్తులు, నగదు సంపాదించినట్లు తేలిందని తెలిపింది ఏసీబీ. రూ.5,05,71,676/- విలువైన చర, స్థిరాస్తులను గుర్తించడం జరిగిందని స్పష్టం చేసింది ఏసీబీ. ఇక్కడ పేర్కొన్న ఆస్తుల విలువ డాక్యుమెంటేషన్ విలువ ప్రకారం ఉంటుందని పేర్కొంది.
నిందితుడు గతంలో ఒక వ్యక్తి నుండి రూ.8,00,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 అనే నంబర్ కు డయల్ చేయాలని, వెంటనే తాము స్పందిస్తామని స్పష్టం చేసింది ఏసీబీ.