గీత రచయిత కులశేఖర్ కన్నుమూత
100 సినిమాలకు పాటలు రాశారు
హైదరాబాద్ – ప్రముఖ సినీ గేయ రచయిత కుల శేఖర్ మంగళవారం కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 100 సినిమాలకు పాటలు రాశారు. అందులో ఎక్కువగా జనరంజకమైన పాటలు ఉన్నాయి. దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద పని చేశారు . వీరి కాంబినేషన్ అద్భుతంగా కొనసాగింది.
చిత్రం, 10 క్లాస్ , ఘర్షణ, తదితర చిత్రాలలో కుల శేఖర్ రాసిన పాటలు ఆకట్టుకున్నాయి. కుల శేఖర్ స్వస్థలం సింహాచలం. తండ్రి టి.పి. శ్రీరామచంద్రాచార్యులు, తల్లి రంగనాయకమ్మ. చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు పొందాడు. చదువు తర్వాత ఈటీవీ గ్రూపులో విలేకరిగా పని చేసాడు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. తర్వాత తేజ దర్శకత్వంలో రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశాడు. తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు పని చేశాడు.
2013 అక్టోబరు 24 న కాకినాడలో శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మ వారి శఠగోపాన్ని దొంగిలించినందుకు గాను పోలీసులు అతన్ని అరెస్టుచేసి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.
గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగి పోయాడు. కుల శేఖర్ రాసిన వాటిలో చిత్రం, జయం , రామ్మా చిలకమ్మా, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు, దాదాగిరి సినిమాలు ఉన్నాయి. కుల శేఖర్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.