అదనపు కార్మిక కమిషనర్ కు వినతిపత్రం
హైదరాబాద్ – జెస్టో డెలివరీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యూయూ) వ్యవస్థాపక అధ్యక్షుడు సలావుద్దీన్. శుక్రవారం అదనపు కార్మిక కమిషనర్ ఈ. గంగాధర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జెప్టో సంస్థ ఉద్యోగుల కార్మిక హక్కులు కాలరాస్తుండటంపై తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని రామంతాపూర్, బోడుప్పల్ సహా అనేక డార్క్ స్టోర్ల వద్ద గత ఐదు రోజులుగా జెప్టో డెలివరీ వర్కర్లు నిరవధిక సమ్మెలో ఉన్నారని తెలిపారు. తగిన వేతనం, సామాజిక భద్రత, న్యాయమైన పని గంటలు, ఉద్యోగ గౌరవం వంటి డిమాండ్లను జెప్టో మేనేజ్‌మెంట్ పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ మాట్లాడారు. ఇది కేవలం వేతనాల కోసం కాదని, తమ హక్కుల కోసం, గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం జెప్టో వంటి యాప్ ఆధారిత కంపెనీలపై జవాబుదారీతనాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్మిక శాఖ, జెప్టో మేనేజ్‌మెంట్, యూనియన్ ప్రతినిధులతో త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సలావుద్దీన్.