టీజీపీడబ్ల్యూయు అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ గిగ్, ప్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. సరైన వేతనాలు చెల్లించడం లేదని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చేపట్టిన సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నామని పేర్కొన్నారు. అనుకోని ప్రమాదాలు జరిగితే ఆర్థిక సాయం అందించక పోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్బంగా టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. దినసరి కూలీలు, కార్మికులు, డెలివరీ బాయ్స్ , డ్రైవర్లంటే ప్రజలకు చులకన భావం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని వేతనాలతో స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత కొన్నేళ్లుగా తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించు కోవడం లేదని వాపోయారు షేక్ సలావుద్దీన్.
ఆయన ప్రభుత్వ దృష్టికి పలు సమస్యలు తీసుకు వచ్చారు. పాత చెల్లింపుల రద్దు లేదా తగ్గింపు కార్మికుల ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. పారదర్శకమైన, స్థిరమైన బేస్ పే వ్యవస్థ అమలు చేయాలని , యాజమాన్యాలు మినిమం పేమెంట్స్ ఇచ్చేలా చూడాలని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని.
ప్రధానంగా గిగ్ , ప్లాట్ఫార్మ్ కార్మికులకు చట్టం, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత అందించడం అత్యవసరమని స్పష్టం చేశారు షేక్ సలావుద్దీన్.