అన్ని సేవలకు సమాన ధరలు కల్పించాలి
టిజిపిడబ్ల్యూయూ ఉద్యమం ప్రారంభం
హైదరాబాద్ – తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూయూ) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ నాయకత్వంలో, ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థల ఎయిర్‌పోర్ట్ ట్రిప్‌లను బహిష్కరించేందుకు యూనియన్ ఉద్యమాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తక్కువ చార్జీలు విధించడం వల్ల డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్న దృష్ట్యా తీసుకున్నట్లు తెలిపారు సంస్థ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్.
ప్రభుత్వం, రవాణా శాఖకు పునరావృతంగా వినతులు అందించినప్పటికీ, ఏకరీతి, న్యాయమైన ధరల గురించి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సమానమైన ధర విధానాన్ని నిర్ణయించాలని డిమాండ్ చేశారు షేక్ సలావుద్దీన్. అన్ని గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల హక్కులను కాపాడటం కోసం ఎంత దాకా అయినా పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
తమ సభ్యులు అన్యాయ ధరల నిర్మాణాలపై అనేకసార్లు తమ బాధలు వ్యక్తం చేసినా పట్టించు కోలేదన్నారు. ఈ తక్కువ చార్జీలు డ్రైవర్ల ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నాయని వాపోయారు. వారి సమయం తో పాటు శ్రమను విలువ తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకొని అన్ని సేవలకు సమాన ధర విధానం అమలు చేయాలని అన్నారు. తమ న్యాయ పరమైన ఉద్యమానికి డ్రైవర్లు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు షేక్ సలావుద్దీన్.