మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త
లహరి..రాజధాని..గరుడ ప్లస్..బస్సుల్లో డిస్కౌంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఖుష్ కబర్ చెప్పింది. సోమవారం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త చెప్పింది.
తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు ఎండీ వీసీ సజ్జనార్.
మెట్రో ఎక్స్ ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు ఈ రాయితీని పొందవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయని తెలిపారు. వారిలో ఎక్కువగా వీకెండ్ లో సొంతూళ్లకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిందని తెలిపారు.. సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చని పేర్కొన్నారు. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించు కోవాలని కోరారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ .