డిపోల కార్యకలాపాలన్నీ సంస్థ ఆధీనంలోనే
హైదరాబాద్ – టీజీఎస్ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ యాజమాన్యం. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సంస్థ పూర్తిగా ప్రభుత్వానికి చెందినదని, ప్రైవేట్ కార్యకలాపాలకు చోటు ఉండదని పేర్కొంది. ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరింది.
ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. కేంద్ర సర్కార్ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేసింది.
ఈ పాలసీ ప్రకారం హైదరాబాద్‌తో సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్టీసీ స్పష్టం చేసింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ తిప్పుతోందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుపాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ప్రవేశపెట్టామని తెలిపింది.