మే 7వ తేదీ నుంచి సేవలు బంద్
హైదరాబాద్ – తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, లేబర్ కమిషనర్లకు నోటీసులు అందజేశారు. మే6వ తేదీ అర్ధరాత్రి నుంచి తాము సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. మే 7వ తేదీ నుండి సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చేపడతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పిందని, తమను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇవాల్టి వరకు ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రధానంగా ఎండీగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తున్నారంటూ మండిపడ్డారు. అకారణంగా నోటీసులు ఇవ్వడం, ఎక్కువ పని గంటలు పని చేయించడం, ఎక్కడ పడితే అక్కడికి మహిళలను పంపించడం దారుణమన్నారు. వెంటనే ఎండీని తొలగించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.