స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎండీ వీసీ సజ్జనార్
వాలంటైన్ డే పేరుతో కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ పేర్కొన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అదేదో ఘనత సాధించినట్లు యువతీ యువకులు ప్రమాదకరమై స్టంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జీవితం అనేది ఒక్కసారే వస్తుందని, మిమ్మల్ని పెంచి పోషిస్తున్న పేరెంట్స్ కు భారం కావద్దని సూచించారు. చాలా మంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయి పోవాలని ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రేమ పేరుతో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రేమ అన్నది జీవితంలో భాగమని దానిని గుర్తించి మసలు కోవాలని సూచించారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ వల్ల పోయేది మీ ప్రాణాలేనని హెచ్చరించారు. గురువారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు మేనేజింగ్ డైరెక్టర్.
అతి వేగంతో ప్రమాదకర రీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి అని హితవు పలికారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం డేంజర్. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకొని.. మీ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేయకండని పేర్కొన్నారు.