ప్రచారం అబద్దమని పేర్కొన్న వీసీ సజ్జనార్
హైదరాబాద్ – టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టారు. సోమవారం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ విపరీతంగా టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించిందన్నారు. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని తెలిపారు. ఈ సందర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేర వేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుందని పేర్కొన్నారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండక పోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయని అన్నారు ఎండీ. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించు కోవాలని 2003లో జీవో నంబర్ 16 న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందన్నారు.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం మేర రద్దీ పెరిగిందని స్పష్టం చేశారు ఎండీ. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, తదితర పండుగలకు బస్సుల్లో ప్రయాణాలు పెరిగాయని తెలిపారు. ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పండుగుల్లో నడిచే స్పెషల్ బస్సులకు చార్జీలను జీవో ప్రకారం సవరించడం జరుగుతోందని పేర్కొన్నారు .
టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 9 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయని వెల్లడించారు. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతుందని తెలిపారు. ఆ 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. మిగతా 8500 రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు వీసీ సజ్జనార్.
పండుగ సమయాల్లో రెగ్యులర్ , స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో తేడాలుండటం సాధారణమని అన్నారు. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు వెళ్లేటప్పుడు రెగ్యులర్ సర్వీసుల్లో ప్రయాణిస్తే సాధారణ టికెట్ ధరనే ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సును వినియోగించుకుంటే జీవో ప్రకారం సవరణ చార్జీలుంటాయని తెలిపారు ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియ జేయడం జరుగుతుందన్నారు ఎండీ.