టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలం నుంచి బెట్టింగ్ యాప్ ల గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ముఖ్యంగా యూత్ ను వాటి బారిన పడవద్దంటూ కోరుతున్నారు. అంతే కాకుండా బెట్టింగ్ యాప్ లను కావాలని ప్రమోట్ చేస్తూ వస్తున్న యూట్యూబర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఎండీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ యాప్ ల కారణంగా చాలా మంది సూసైడ్ చేసుకున్నారని ఆవేదన చెందారు. తమ ఆదాయం కోసం ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఎండీ.
బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వీసీ సజ్జనార్. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వీలైతే జైలుకు పంపించాలని సూచించారు. ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతున్నది అంటూ మండిపడ్డారు. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తోందన్నారు. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమజాహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా అని నిలదీశారు ఎండీ. ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి అంటూ కోరారు.