రద్దీకి తగినట్టు బస్సులు నడుపుతాం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ ) మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. టీజీఎస్ఆర్టీసీకి చెందిన ఒక బస్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా యాజమాన్యం దృష్టికి వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారని స్పష్టం చేశారు ఎండీ.
అయినా కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ వీపరీతంగా ఉంటున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించిందని అన్నారు వీసీ సజ్జనార్.
ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోందన్నారు ఎండీ. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రతి రోజు లక్షలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు రవాణా పరంగా ఇబ్బందులు లేకుండా తగినన్ని బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు.
కావున, తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫుట్ బోర్డు ప్రయాణం చేయకుండా సహకరించాలని ఎండీ సజ్జనార్ విద్యార్థులను కోరారు.