ఫిబ్రవరి 9 నుంచి నిరవధిక సమ్మె
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. ఆయన ఒంటెద్దు పోకడ పోతున్నాడని, హక్కులను కాలరాస్తూ నియంత లాగా వ్యవహరిస్తున్నాడని వాపోయారు. ఇప్పటి వరకు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. అందుకే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 9 వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా తమకు పీఆర్సీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు.