కులం..మతం..అవినీతిపై యుద్ధం – తళపతి విజయ్
తమిళనాడులో పోటెత్తిన జన సంధ్రం
తమిళనాడు – తమిళనాడు రాజధాని చెన్నై జన సంధ్రంగా మారింది. ప్రముఖ నటుడు తళపతి విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీ ఏర్పాటైంది. ఈ సందర్బంగా ఆదివారం భారీ ఎత్తున సభను చేపట్టారు. ఎవరూ ఊహించని రీతిలో లక్షలాది మంది జనం తరలి వచ్చారు. ఎక్కడ చూసినా తళపతి అభిమానులే కనిపించారు.
ఈ సందర్బంగా అశేష జన వాహినిని ఉద్దేశించి ఉద్వేగ భరితంగా ప్రసంగించారు తళపతి విజయ్. ఈ సందర్బంగా సమాజాన్ని , రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న కులాన్ని, మతాన్ని, ఆక్టోపస్ లా పేరుకు పోయిన అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పని చేస్తామని ప్రకటించారు .
తమ విధానం ప్రజల పక్షమని స్పష్టం చేశారు తళపతి విజయ్. ప్రజలందరూ సమానమేనని అన్నారు. లౌకిక సామాజిక న్యాయ సిద్దాంతాలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పారు . ప్రజాస్వామ్యం మరింత బలపడేలా, అన్ని సామాజిక వర్గాలకు పాలనలో , అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు . కులం ఆధారంగా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
మహిళలకు సమానత్వం, సెక్యులరిజం, రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి, తమిళం, ఇంగ్లీష్ మాత్రమే ఉండేలా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు తళపతి విజయ్.