డీలిమిటేషన్ పేరుతో రాజకీయాలు వద్దు
చెన్నై – తమిళ సినీ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తమిళనాడును తేలికగా తీసుకోవద్దంటూ హెచ్చరించాడు. చాలా రాష్ట్రాలకు చుక్కలు చూపించిన చరిత్ర తమదన్నారు. డీ లిమిటేషన్ పేరుతో కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచనతో తమిళనాడుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం దళపతి విజయ్ మీడియాతో మాట్లాడారు.
ఆయన రాష్ట్రాల పునర్విభజన పై సీరియస్ గా స్పందించారు. ఇందుకు సంబంధించి బిజేపీయేతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఇటీవలే చెన్నై వేదికగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కీలక మీటింగ్ కు తమిళనాడు సీఎంతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఏకగ్రీవంగా కేంద్ర సర్కార్ పై మండిపడ్డారు.