‘తళపతి’ రాణిస్తాడా ‘పవర్’ లోకి వస్తాడా
రాష్ట్ర రాజకీయాలలో కలకలం
తమిళనాడు – తమిళనాడు రాజకీయాలలో ప్రముఖ నటుడు తళపతి విజయ్. తమిళ వెట్రి కజగం పేరుతో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. చెన్నై వేదికగా ఆగస్టు 22న గురువారం కీలక ప్రకటన చేశాడు. పార్టీకి సంబంధించి గీతాన్ని కూడా రిలీజ్ చేశాడు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు విజయ్. గత కొంత కాలం నుంచీ తను పార్టీ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు ఇవాళ తాను తగ్గేదేలే అంటూ స్పష్టం చేశాడు. ఇప్పటికే రాష్ట్రంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ సంకీర్ణ సర్కార్ కు వ్యతిరేకంగా తను కీలక వ్యాఖ్యలు చేశాడు విజయ్. ఇదే సమయంలో తను సైకిల్ పై వెళ్లి ఓటు వేశాడు. అది ఓ సంచలనం రేపింది దేశ వ్యాప్తంగా.
సీఎం స్టాలిన్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వక పోయినా సైకిల్ పై ప్రయాణించడం ద్వారా తన అభిమానులకు లోపాయికారిగా డీఎంకేకు ఓటు వేయమని చెప్పకనే చెప్పారు విజయ్. లక్షలాది మందికి ఆయన ఆరాధ్య దైవం. తనను ఆప్యాయంగా తళపతి అని పిలుచుకుంటారు తమిళనాడులో. తను ఏ సినిమా చేసినా అందులో సామాజిక సందేశం ఉండేలా చూశాడు . ఈ మధ్యన పదే పదే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజాస్వామ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంతే కాదు విద్య, వైద్యం, ఉపాధి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని , తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగంగానే విమర్శించాడు.
తను నటించిన మెర్సిల్ లో వీటి గురించి ప్రశ్నించాడు. ఇక సర్కార్ చిత్రంలో ఓటు విలువ ఏమిటో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఓటు ఎంతటి శక్తి వంతమైనదో చెప్పేందుకు కృషి చేశాడు విజయ్. రాష్ట్రంలో ఇప్పటి వరకు సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాలలో ఎంటర్ అయ్యారు. జయలలిత, విజయ్ కాంత్ భౌతికంగా లేరు. కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ ఏర్పాటు చేశారు. మరో దిగ్గజ నటుడు రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని అనుకున్నారు. పార్టీ పెట్టకుండానే విరమించు కుంటున్నట్లు ప్రకటించాడు. గత కొంత కాలం నుంచీ సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ వచ్చారు.
తన వాయిస్ ను, తన ఆలోచనలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ప్లాన్ చేశాడు.
ఆ దిశగా విజయ్ పార్టీ వెనుక నలుగురు పని చేస్తున్నారు. వారంతా ఆయనకు బలం చేకూర్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. వచ్చే 2026లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు జోసెఫ్ విజయ్. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలతో తమిళ వెట్రీ కజగం (టీవీకే) పోటీ పడబోతోంది. ఏ మేరకు తను సక్సెస్ అవుతాడనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా పరంగా తళపతి విజయ్ సక్సెస్ అయినా రాజకీయ పరంగా ఏ మేరకు రాణిస్తాడనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.