మట్టి మనుషుల ఆక్రందన తంగలాన్ ఆవేదన
భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలు రాయి
కంట కన్నీళ్లు రాక పోతే, శరీరం గాయ పడక పోతే..గుండె మండక పోతే..బతికీ ఉండీ ఏం లాభం..తర తరాలుగా జరుగుతున్న దాష్టీకాన్ని, వివక్షను, కుల రక్కసిని, అది చేసే దోపిడీని, ఆధిపత్యపు అహంకారం ఎలా మనుషులను..మట్టికి కాకుండా చేస్తుందో కళ్లకు కట్టినట్లు తెర మీద తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు పా రంజిత్. తను ఏది కోరుకున్నాడో..తను ఏది భావించాడో..తను ఏది అనుభవించాడో..తను ఏది కోల్పోయాడో..వాటినే ఆవిష్కరించాడు. అదే తంగలాన్. ప్రతి చోటా ఆధిపత్యమే..ప్రతి నిత్యం నరకమే..ప్రతి క్షణం యుద్దమే. అస్తిత్వం కోసం అంతులేని విధంగా..అనాది నుంచీ అంతర్మథనం కొనసాగుతూ వస్తూనే ఉంది. తరాలు మారినా..కాలం గడిచినా ..సాంకేతికత కొత్త రూపం సంతరించుకున్నా..వస్తు వ్యాపారం ప్రభావితం చేస్తున్నా ..కులం ఎక్కడా తగ్గడం లేదు. అది కొత్త రూపంలోకి మారి పోతూ..మనుషుల్ని కాటేస్తోంది. పైకి లేదని చెప్పినా..అది అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. బయటకు చెప్పేందుకు కొందరు ఒప్పుకోక పోవచ్చు..కానీ ఆ కులమే అధికారాన్ని చెలాయిస్తోంది..ఆ కులమే మనల్ని శాసిస్తోంది. ఆ కులమే మనల్ని కాకుండా చేస్తోంది..తెలియకుండానే చంపేస్తోంది..ఆక్టోపస్ లా విస్తరిస్తూ జలగల్లా పీల్చేస్తోంది..కులాన్ని ఆధారంగా చేసుకుని మతం మనుషుల్ని..భూమిని..ప్రాంతాలను, దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని విడదీస్తోంది. ఇది విస్మరించ లేని వాస్తవం..నిజం కూడా. కాదన లేం.
ప్రతి చోటా ..ప్రతి నోటా..ప్రతి నిమిషం కులం ప్రస్తావన లేకుండా బతకలేని పరిస్థితి దాపురించింది..అఘోరించింది..శ్రమించకుండా లాభాన్ని ఆశించే అలగా జనం ఇప్పుడు అధికారాన్ని చెలాయించడం చూస్తూనే ఉన్నాం. ఆనాటి నుంచి నేటి దాకా కులం పునాదులను కదిలించాలని, నామ రూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించిన వాళ్లను ఈ లోకం బతకనిచ్చిందా..ఏదో ఒక నెపం ముద్ర వేసి..చంపేసింది..ఇంకా చంపుతూనే ఉంది..ఒక రకంగా పిచ్చి కుక్క అనే పేరు పెట్టి సమాజంలో లేకుండా చేస్తోంది. కులం గురించి ప్రస్తావించకుండా పా రంజిత్ గురించి మాట్లాడకుండా ఉండలేం. తను సామాజిక బాధ్యతను గుర్తించిన వ్యక్తి. మనుషులను మనుషులుగా చూడలేని వాళ్లు ఉన్నంత కాలం ఈ బాధలు అనుభవించాల్సిందేనని చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు సినిమా అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాడు. తాను ఏం చెప్పాలని అనుకున్నాడో..నిర్ణయంగా గొంతెత్తి ప్రశ్నిస్తూనే ఉన్నాడు..నిలదీస్తూనే ఉన్నాడు. తను తీసిన ప్రతి సినిమా సమస్యను ఎత్తి చూపింది. తలైవా లాంటి రజనీకాంత్ లాంటి వాడే పా రంజిత్ ను చూసి మెస్మరైజ్ అయ్యాడు. తనతో రెండు సినిమాలు తీశాడు. ఇదంతా తన మీద తనకున్న నమ్మకం. అంతకు మించి ఎవరికీ భయపడక పోవడం..ధిక్కార స్వరం వినిపించడం.
చరిత్రలో నిజాలు ఉంటాయని అనుకోవడం ఓ భ్రమ. కానీ గతం అన్నది తెలుసుకోక పోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రతి క్షణం పోరాటం అన్నది చేయక పోతే మనం మరణించినట్లే..ఇక మనం ఉండీ ఏం లాభం..ఎందు కోసం అని మొద్దు బారి పోయిన మెదళ్లను ..తుప్పు పట్టి పోయిన శరీరాలను..భ్రష్టు పట్టి పోయిన హృదయాలను బాగు చేసే ప్రయత్నమే తంగలాన్. ఇది సినిమా కాదు..అణగారిన వర్గాల ఆత్మ గౌరవం..తలవంచని పతాకం..కోట్లాది అన్నార్థుల ఆర్తి గీతం.. చిరునామాకు నోచుకోని భూమి బిడ్డల బతుకు పోరాటం. తంగలాన్ కోసం ఎంత కష్టపడ్డాడు..ఎంతగా మధన పడ్డాడు..తెర మీద గడ్డ కట్టుకు పోయిన దుఖాఃన్ని మన దోసిట్లోకి వచ్చేలా చేశాడు. పా మన కాలంలో ఉన్నందుకు మనం గర్వ పడాలి..అంతకు మించి మనుషుల పట్ల అవిభాజ్యమైన ప్రేమను కలిగి ఉన్నందుకు రుణపడి ఉండాలి. ఎందుకు అతడికి ఇంత ప్రేమ..ఈ పిడికెడు మట్టి కోసం ఎందుకింత ఆరాటం. ఎందుకింతటి నిర్వేదం..అన్నింటిని కలిపి ..మనకు ఆయుధం ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు.
ఇది మట్టి మనుషుల ఆక్రందన..అంతులేని ఆవేదనకు ప్రతి రూపమే తంగలాన్. వెండి తెరకు దొరికిన వజ్రం చియాన్ విక్రమ్. తనను మలిచిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే నిబద్దత కలిగిన అరుదైన వ్యక్తి. ఏ నటుడికైనా ..ఆలోచనా పరంగా..భావ జాలం పరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ పా రంజిత్ తో స్నేహం చేయకుండా ఉండలేరు. ఏదో ఒక నేపథ్యం అన్నది లేక పోతే చెప్పాలని అనుకున్న దానిని సరిగా ఆవిష్కరించ లేం. చియాన్ తో పాటు పార్వతి తిరువోతు ..మాళవిక మోహన్ ..ఇతర నటులు పాత్రలకు ప్రాణం పోశారు..ప్రతి క్షణం పరవించేలా చేశారు. సినిమా చూస్తున్నంత సేపు మనం వేరై పోతాం..సినిమాకు మరో బలం సంగీతం. తంగలాన్ ను మరో స్థాయిలో నిలిచేలా చేసింది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో బంగారు గనుల గురించి సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది పక్కన పెడితే పా రంజిత్ వ్యాపార దృష్టికి వెళ్లలేదు..ఆ గనుల వెనుక శ్రమ జీవులు చిందించిన స్వేదం గురించి ఆలోచించాడు. ఇది కల్పిత కథ కాదు..కార్మికుల నిజ జీవితాలు పడిన కష్టాలను తెర మీద ప్రదర్శించేందుకు తంటాలు పడ్డాడు పా రంజిత్.
ఇలాంటి కథలు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి. ఇంతగా దగా పడిన..కన్నీళ్లు కార్చేలా చేసిన..ప్రాణాలు కోల్పోయిన కథలు కొన్నే..అలాంటి కన్నీటి కథే ఈ తంగలాన్.. విక్రమ్ తంగలాన్ గంగమ్మ పార్వతి ఇద్దరూ భార్య భర్తలు..వేప్పూర్ ఊరులో చిన్న భూమిలో సాగు చేసుకూంటు ఉంటారు. పంట చేతి కొచ్చే సమయంలో జమిందారు గద్దలా వాలి పోతాడు. తన మనుషులు దగ్ధం చేస్తారు..ఇంకేం అతడి కన్ను భూమిపై పడింది..పన్ను కట్ట లేదంటూ పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడు..అంతేనా వెట్టి చాకిరీ చేయిస్తాడు. ఈ ఊరికి సమీపంలోనే బంగారు గనులు ఉన్నాయని , తవ్వేందుకు ప్లాన్ చేస్తాడు..బ్రిటీష్ దొర..దెయ్యాలు ఉన్నాయని…అడవి బిడ్డలు చంపుతారంటూ భయంతో ముందుకు రారు..ఇక్కడే కథ మరింత కట్టి పడేస్తుంది..గనులు తవ్వితే డబ్బులు ఇస్తానంటూ గ్రామస్తులకు చెప్పడం..తంగలాన్ రెడీ కావడం..తనవారితో బంగారు గనుల కోసం దొరతో కలిసి బయలు దేరే సన్నివేశాలు గుండెల్ని కదిలించేలా చేస్తాయి.
ఇక్కడే తంగలాన్ కు ఓ కల వస్తూ ఉంటుంది..ఆ కలలో మాళవిక పోషించిన ఆరతి వస్తుంటుంది. ఆరతికి ..తంగలాన్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే దానిపై ఉత్కంఠ పెంచే ప్రయత్నం చేశాడు పా రంజిత్. తొలి భాగం ఆలోచనలను రేకెత్తిస్తాడు..పసిడిని స్వంతం చసుకోవాలనే వారిని ఆరతి ఎలా ఇబ్బందులు పెడుతుందనే దానిని కళ్లకు కట్టినట్లు తెర మీద చూపించాడు దర్శకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే కాలం సరి పోదు..తంగలాన్ భారతీయ సినిమాలో విస్మరించ లేని పదం..బలమైన సందేశాన్ని ఇంత గొప్పగా ఈ మధ్య కాలంలో చెప్పిన వారు లేరు..ఈ మట్టి మనది..ఈ ప్రకృతి మనది. కానీ అనాది నుంచి అడవిని, జంతువులను , నేలను కాపాడుకుంటూ వస్తున్న మనందరిదీ.. అంటే శ్రామికులది..బహుజనులది..మరి ఆరుగాలం శ్రమించి రక్షించే మన దగ్గర భూమి లేక పోవడం విచిత్రం కదూ. వనరులన్నీ విధ్వంసం చేస్తూ..మనల్ని దూరం పెట్టే ఈ దుర్మార్గమైన మోసం..దగా..వివక్ష ఇంకెంత కాలం అని ప్రశ్నిస్తాడు..గతం మనం..వర్తమానం కూడా మనమే కావాలి..అందుకే సినిమాలో ప్రతి చోటా బుద్దుడు కనిపిస్తాడు..చివరకు తల నరకడం తోనే పా రంజిత్ మనం ఏం కోల్పోయామో..చెప్పే ప్రయత్నం చేశాడు..ఒక చట్రంలో ఇరుక్కు పోయిన వాళ్లకు..ఇంకొకరి ఆధిపత్యాన్ని..భావ జాలాన్ని జీర్ణించు కోలేని వాళ్లకు తంగలాన్ అర్థం కాదు..వాళ్ల దృష్టిలో అది నిరర్థకం..కానీ తంగలాన్ కోట్లాది అన్నార్థుల..అభాగ్యుల..ఆకలి కేకలతో అల్లాడుతున్న బడుగు జీవుల ఆర్తి గీతం..దృశ్య కావ్యం.