డ్రగ్స్ తీసుకున్న హేమ – ఛార్జిషీట్
ఆరోపించిన కర్ణాటక పోలీసులు
కర్ణాటక – టాలీవుడ్ లో కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధానంగా తెలుగు సినిమా రంగానికి చెందిన కొందరు నటులు ఉన్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా నటి హేమ ఇందులో పాల్గొన్నదని పోలీసులు ఆరోపించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ తరుణంలో తాను అలాంటి వ్యక్తిని కానని, తనకు డ్రగ్స్ అంటే ఏమిటో తెలియదని బుకాయించే ప్రయత్నం చేసింది నటి హేమ. గురువారం ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు.
మొత్తం 1086 పేజీలతో ఛార్జిషీట్ ను దాఖలు చేయడం విశేషం. ఇందులో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రధానంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నటి హేమ గురించి సంచలన నిజాలు వెల్లడించారు పోలీసులు.
ఈ రేవ్ పార్టీలో నటి హేమ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు ఆధారాలు లభించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్ లో జోడించడం విశేషం. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్నారు.