అందజేసిన పెన్నా సిమెంట్ అధినేత
తిరుపతి – ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారికి భారీ ఎత్తున విరాళం అందింది. పెన్నా సిమెంట్ అధినేత పి. ప్రతాప్ రెడ్డి తన కుటుంబంతో కలిసి మూడు బంగారు కిరీటాలను విరాళంగా ఇచ్చారు.7 కిలోల బరువున్న, దాదాపు రూ. 6.60 కోట్ల విలువైన రాళ్ళు పొదిగిన బంగారు కిరీటాలను సమర్పించారు. పూజలు నిర్వహించిన తర్వాత గర్భగుడిలోని శ్రీ సీతారామ లక్ష్మణుడి ప్రధాన దేవతలకు అలంకరించారు. టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ జె. శ్యామలరావు పెన్నా సిమెంట్ కుటుంబ సభ్యులను సత్కరించారు. టిటిడి అధికారులు, ఇతర భక్తులు కూడా హాజరయ్యారు.
అనంతరం కోదండరామ స్వామి ఆలయం వేదికగా సీతా రాములోరి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 70 వేల మందికి పైగా భక్త బాంధవులు హాజరయ్యారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కళ్యాణోత్సవాన్ని తిలకించారు. దివ్య వివాహ వేడుక సాయంత్రం 6:30 గంటలకు భగవత్ విజ్ఞానపథంతో ప్రారంభమై రాత్రి 8:30 గంటల వరకు కొనసాగింది.