NEWSTELANGANA

కిన్నెర మొగిల‌య్య‌కు ఇంటి స్థ‌ల ప‌త్రాలు

Share it with your family & friends

అంద‌జేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలోని న‌ల్ల‌మ‌ల ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ కిన్నెర వాయిద్య‌కారుడు మొగిల‌య్య‌కు సాంత్వ‌న చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొగిల‌య్య‌కు ఇంటి స్థ‌లానికి సంబంధించిన ధ్రువ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

గ‌తంలో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ స‌ర్కార్ హ‌యాంలో కిన్నెర మొగిల‌య్య‌కు ఇంటి స్థ‌లంతో పాటు రూ. 1 కోటి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి అప్ప‌టి సీఎం కేసీఆర్ ఘ‌నంగా స‌న్మానం చేశారు.

ఇదే స‌మ‌యంలో అంత‌రించి పోతున్న కిన్నెర వాయిద్యాన్ని ప‌రిరక్షిస్తున్నందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మక‌మైన ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. తాజాగా హైద‌రాబాద్ లోని హ‌య‌త్ న‌గ‌ర్ లో 600 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లాన్ని కేటాయించ‌గా ఇందుకు సంబంధించిన ప‌త్రాల‌ను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న‌తో పాటు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ చిక్కుడు వంశీకృష్ణ‌తో పాటు సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు.

త‌న‌కు ఇంటి స్థ‌లం ప‌త్రాలు అంద జేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు కిన్నెర వాయిద్య‌కారుడు మొగిల‌య్య‌.