రాజ్యసభ సీట్ల ఎన్నికల షెడ్యూల్
విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యసభలో ఏర్పడిన ఖాళీలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
వీటితో పాటు ఒడిశా , పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాలలో ఒక్కొక్క స్థానానికి ఖాళీ ఏర్పడింది. మొత్తంగా ఆరు సీట్లకు సంబంధించి ఎన్నికల తేదీలను ఖరారు చేసింది ఎన్నికల సంఘం. ఇటీవలే ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు రాజీనామాలు చేశారు.
వ్యక్తిగత కారణాల రీత్యా తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని , 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొంది.
డిసెంబర్ 13 వరకు నామినేషన్లు ఉప సంహరించు కునేందుకు గడువు విధించింది. డిసెంబర్ 20న పోలింగ్ ఉంటుందని, ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.