NEWSTELANGANA

తోపుడు బండి సాదిక్ అలీ ఇక లేరు

Share it with your family & friends

మాన‌వ‌తావాదిని కోల్పోయిన తెలంగాణ

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, తోపుడు బండి వ్య‌వ‌స్థాప‌కుడు షేక్ సాదిక్ అలీ ఇవాళ క‌న్ను మూశారు. కాన‌రాని లోకాల‌కు వెళ్లి పోయారు. ఆయ‌న ఇక లేర‌న్న వార్త‌ను జీర్ణించు కోలేక పోతున్నారు సాహితీ, మీడియా, వివిధ ప్ర‌జా సంఘాల‌కు చెందిన వారు. చాలా మంది దీనిని న‌మ్మ లేక పోతున్నామంటూ పేర్కొంటున్నారు. సామాజిక మాధ్య‌మాల‌లో షేక్ సాదిక్ భాయ్ కి నివాళులు అర్పిస్తున్నారు.

ఎవ‌రిని క‌దిపినా సాదిక్ భాయ్ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. అత్యంత ఆత్మీయుడు, స్నేహశీలి, ప్ర‌త్యేకించి పిల్ల‌లంటే ఆయ‌న‌కు వ‌ల్ల‌మాలిన అభిమానం. త‌న భార్య ఉష వ్య‌వ‌సాయ శాఖ‌లో ప‌ని చేస్తున్నారు. బ‌దిలీపై హైద‌రాబాద్ కు రావ‌డంతో సంతోషంగా ఉన్నారు. ఇంత‌లోనే సాదిక్ అలీ క‌న్ను మూయ‌డం అంద‌రిని విస్మ‌యానికి గురి చేసింది.

ఆయ‌న ఇటీవ‌లే చికెన్ గున్యా బారిన పడ్డారు. ఆ త‌ర్వాత కోలుకున్నారు. ఇక బడి పిల్లలతోనే తన జీవితమని సాదిక్ పడిన ఆనందం రోజుల వ్యవధిలోనే ఆవిరి అయిపోయింది. గత కొన్నేళ్లుగా ఆయన నోటి వెంట పిల్లలు, పిల్లలు అనే మాట తప్ప మరో మాట లేదు.

బీదా బిక్కీ పిల్లలు చదువు కోవడానికి పుస్తకాలు కొనాలి. యూనిఫారాలు కొనాలి . బెల్టులు కొనాలి అంటూ అస్తమానం ఆత్రపడేవాడు. ఎవరైనా చిన్న సాయం చేస్తే అది కొండంత సాయంగా భావించి పోస్టులు పెట్టేవాడు. దాత ఎక్కడ వున్నా, అందుకునే సాయం చిన్నదా పెద్దదా అని ఏమాత్రం ఆలోచించకుండా ఆఘమేఘాల మీద వెళ్ళేవాడు.

అసలు ఏమాత్రం ఆర్థిక పరమైన నేపథ్యం లేని మనిషి ఇన్నిన్ని పనులు చేయగలిగాడు అంటే అది అతడిలోని నిజాయితీ, కర్తవ్యం పట్ల అతడికి వున్న కట్టుబాటు, నిబద్ధత మాత్రమే కారణం . చదువుకునే చిన్నారులు అంటే సాదిక్ కు వున్న ఆప్యాయానురాగాలు తెలుసుకోవాలి అంటే అతడి వాల్ పై రాసుకున్న పోస్టులు చదవాలి. క‌ల్లూరు బ‌డి పిల్ల‌లు తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.