రేపటి నుంచి పద్మావతి అమ్మ వారి ఉత్సవాలు
అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహణ
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ప్రసిద్ద పున్య క్షేత్రం తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైంది. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయ దశమి నాడు రాత్రి 7:45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మ వారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
ఇదిలా ఉండగా నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, అక్టోబరు 4, 11వ తేదీలలో లక్ష్మీపూజ, అక్టోబరు 12న ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది.