తిరుమలలో భక్తుల కిటకిట
దర్శించుకున్న భక్తులు 81,057
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం . సుదూర ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలి వస్తున్నారు. అసలే వేసవి కాలం కావడం, పిల్లలకు పరీక్షలు అయి పోవడంతో పెద్ద ఎత్తున స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో ముందు జాగ్రత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి పర్యవేక్షణలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. శ్రీవారి సేవకులు సేవలో నిమగ్నం అయ్యారు. ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను ఆదివారం ఏకంగా 81 వేల 57 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 918 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
కాగా భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్ మెంట్లలో ఉన్నారని, కాగా ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి కనీసం 12 గంటలకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉందని పేర్కొంది టీటీడీ.