వైభవోపేతం రథసప్తమి ఉత్సవం
తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమల గిరులు పులకించి పోయాయి భక్తుల గోవింద నామ స్మరణతో. టీటీడీ ఆధ్వర్యంలో రథ సప్తమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి వారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒక రోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.
అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభ వాహనం. సర్వ లోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు.
రథ సప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహన సేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో చదుకుంటున్న వంద మందికి పైగా విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్య హృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. కొన్నేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాస గద్యం తదితర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్పీ మలికా గార్గ్ పాల్గొన్నారు.