వైభవోపేతం రథ సప్తమి ఉత్సవం
భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా..అనాధ రక్షక గోవిందా అంటూ భక్తులు పారవశ్యంతో మునిగి పోయారు.
ఉదయం 5.30 గంటలకు రథ సప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి, డిప్యూటీ ఏఈవో వీర బ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. టీటీడీ సిబ్బంది, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిమగ్నం అయ్యారు.
తిరుపతి ఎస్పీ మలిక గర్గ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఇక రథ సప్తమి ఉత్సవాలు ఇవాళ రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. ఉదయం శ్రీవారు సూర్య ప్రభ వాహన సేవ , 9 గంటలకు చిన్న శేష వాహనంపై ఊరేగారు. 11 గంటలకు గరుడ వాహనం , మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, 2 గంటలకు చక్ర స్నానం, సాయంత్రం 4 గంటలకు కల్ప వృక్ష వాహనం , 6 గంటలకు సర్వ భూపాల వాహనం , రాత్రి 8 గంటలకు చంద్ర ప్రభ వాహన సేవపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.