తిరుమల క్షేత్రం భక్త సందోహం
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువు తీరిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో అలరారుతోంది. ఎక్కడ చూసినా భక్తులే దర్శనం ఇస్తున్నారు. తమ కష్టాల నుంచి స్వామి గట్టెక్కిస్తాడని భావిస్తారు.
తిరుమల గిరులన్నీ భక్తుల స్వామి స్మరణతో హోరెత్తుతున్నాయి. గోవిందా గోవిందా, శ్రీనివాసా గోవిందా, అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. స్వామి జపం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) విస్తృతంగా చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 70 వేల 570 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. 22 వేల 490 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని పేర్కొంది.
భక్తులు నిత్యం స్వామి వారి కోసం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీివారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చిందని వెల్లడించింది టీటీడీ. శ్రీనివాసుడి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 14 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపింది.