పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి అష్టకష్టాలకు ఓర్చి వచ్చే భక్త బాంధవులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎండా కాలం కావడంతో అన్న ప్రసాదం, జల ప్రసాదం , మజ్జిగ భక్తులకు అందజేస్తున్నారు శ్రీవారి సేవకులు.
కాగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 80 వేల 532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 438 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. నిత్యం స్వామి, అమ్మ వార్లకు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
పిల్లలకు సెలవులు వస్తుండడంతో రోజురోజుకు రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం ఏటీసీ లైన్ లో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ తెలిపింది. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం ఒక గంటకు పైగానే పట్టే ఛాన్స్ ఉందని పేర్కొంది టీటీడీ .