తిరుమల క్షేత్రం భక్త సందోహం
దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,510
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి అష్టకష్టాలకు ఓర్చి వచ్చే భక్త బాంధవులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎండా కాలం కావడంతో అన్న ప్రసాదం, జల ప్రసాదం , మజ్జిగ భక్తులకు అందజేస్తున్నారు శ్రీవారి సేవకులు.
విద్యార్థులకు ఎండా కాలం సెలవులు ఇవ్వడంతో భారీ ఎత్తున భక్త జనం తరలి వస్తుండడంతో తిరుమల కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను ఏకంగా 2 వేల 510 మంది భక్తులు దర్శించుకున్నారు.
30 వేల 441 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. నిత్యం స్వామి, అమ్మ వార్లకు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.62 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం కనీసం 12 గంటలకు పైగా పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.