భక్తుల రద్దీతో తిరుమల కిటకిట
కొనసాగుతున్న భక్తుల సందడి
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భక్త బాందవులు భావించే తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల సందడితో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, అనాధ రక్షక గోవిందా ఆపద మొక్కుల వాడా గోవిందా , అదివో అల్లదివో శ్రీహరి వాసము, పది వేల శేషుల పడగల మయం అంటూ భక్తులు స్మరిస్తున్నారు. శ్రీనివాసుడి , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఎక్కడ చూసినా భక్త జన సందోహమే కనిపిస్తోంది.
సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఈ మేరకు శ్రీవారి సేవకులు విశిష్ట సేవలు అందజేస్తున్నారని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉండగా శుక్రవారం పూర్తయ్యే సరికి స్వామి వారిని 63 వేల 163 మంది దర్శించుకున్నారు. 31 వేల 287 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.99 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి.